పాడి పరిశ్రమ, పశుపోషణపై క్షేత్రస్థాయిలో అవగాహన.. స్వయం ఉపాధికి స్ఫూర్తినిచ్చే విజిట్!
విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం (పున్నమి ప్రతినిధి): సెప్టెంబర్ 26 ::
విద్యార్థినులకు పుస్తక జ్ఞానంతో పాటు ప్రాయోగిక పరిజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో నెలతేరు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థినులు పారిశ్రామిక డైరీ ఫారాన్ని సందర్శించారు. ప్రిన్సిపల్ శ్రీమతి దొండా చంద్రకళ గారి ఆదేశాలతో,ఒకేషనల్ టీచర్ శ్రీమతి స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో శోంఠ్యం గ్రామంలోని కిరణ్ కృష్ణ రియల్ ఎస్టేట్స్ ప్రాంగణంలో ఉన్న డైరీ ఫారంలో ఈ క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు.
పాడి పరిశ్రమపై ప్రత్యక్ష అవగాహన
ఈ సందర్భంగా విద్యార్థినులు పశువుల పెంపకం, పశుపోషణ, పాల ఉత్పత్తి, డైరీ ఫారం నిర్వహణ తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకున్నారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను క్షేత్రస్థాయిలో అనుభవించడం ద్వారా పాడి పరిశ్రమపై మరింత అవగాహన పొందారు.
స్వయం ఉపాధికి బాటలు
వృత్తి విద్యలో భాగంగా నిర్వహించిన ఈ సందర్శన విద్యార్థినుల్లో నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, భవిష్యత్తులో పాడి పరిశ్రమ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవచ్చో తెలుసుకునేందుకు ఉపయోగపడింది. విద్యతో పాటు వృత్తిపరమైన అవగాహన కల్పించే ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థినుల భవిష్యత్తుకు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కేజీబీవీ పేరెంట్స్ కమిటీ చైర్మన్ కోరుకొండ శివాజీ, ప్రజా సంకల్ప వేదిక విద్యార్థి విభాగం జాతీయ ఉపాధ్యక్షులు బి. బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.


















