పనికోసం వచ్చి.. తిరిగిరాని లోకాలకు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కలువాయి: పనికోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన గురువారం కలువాయి మండలంలో చోటుచేసుకుంది. వెంకటరామరాజుపేట గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 765పై కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అనంతసాగరం మండలం పాత దేవరాయపల్లికి చెందిన మణికల సుధాకర్ (55), షేక్ రసూల్‌బాషా (52) మృతి చెందారు. చింతలపాలెం గ్రామంలో పెయింటింగ్ పని ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రసూల్‌బాషా అక్కడికక్కడే మృతి చెందగా, సుధాకర్‌ను 108లో తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. రాపూరు సీఐ శ్రీనివాసులు, ఎస్సై కోటయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


