ఆత్మకూరు, మే 29 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): కీటక జనిత వ్యాధులను పూర్తిగా నియంత్రించడంలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని జిల్లా మలేరియా అధికారి ఎం. సింహాచలం పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెం ఎస్టీ కాలనీలో ‘ఫ్రైడే – డ్రైడే’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించారు. కార్యక్రమాన్ని హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (హెచ్ఈవో) సుధాకర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో హెచ్ఈవో సుధాకర్ మాట్లాడుతూ, ప్రతి వారం నిర్వహించే ‘ఫ్రైడే – డ్రైడే’ కార్యక్రమాన్ని ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ప్రమాదకర వ్యాధుల పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇళ్ల పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన తెలిపారు. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, డబ్బాలు, కూలర్లు, నీటి ట్యాంకులు వంటి ప్రదేశాల్లో నీరు నిల్వ ఉంటే దోమలు అధికంగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. వారానికి ఒకరోజు ఇంటి పరిసరాలను పూర్తిగా పరిశుభ్రం చేసి పొడిగా ఉంచే అలవాటు పెంపొందించుకోవాలని ప్రజలకు సూచించారు.కీటక జనిత వ్యాధుల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని హెచ్ఈవో పేర్కొన్నారు. ప్రభుత్వం, వైద్యశాఖ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించి తమ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. జ్వరం, వాంతులు, తలనొప్పి, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.అనంతరం అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చిన మహిళలకు, స్థానిక ప్రజలకు దోమల నివారణ చర్యలు, ఇంటి పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సంరక్షణ వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ జి. రవీందర్ రెడ్డి, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, స్థానిక కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని వైద్య సిబ్బంది తెలిపారు.


