
ఆత్మకూరులో నాలుగు రోజుల పాటు వైఎస్సార్‌సీపీ ఆందోళన
ఆత్మకూరు, ఆగస్టు 5 (పున్నమి ప్రతినిధి): డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలను నిరసిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నేటి నుంచి ఆత్మకూరులో నాలుగు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు ప్రారంభం కానున్నాయి.వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సూచనలతో ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు ఈ దీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్షలు కొనసాగుతాయి.
దీక్షల షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 6న సంగం, ఏఎస్‌పేట మండలాలు, 7న చేజర్ల, అనంతసాగరం మండలాలు, 8న మర్రిపాడు, ఆత్మకూరు రూరల్, 9న ఆత్మకూరు టౌన్‌కు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు దీక్షల్లో పాల్గొంటారు.ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా ఆగస్టు 10న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.కావున ఆయా తేదీల్లో సంబంధిత మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు, నిరుద్యోగ యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రిలే నిరాహార దీక్షలను, ముగింపు ర్యాలీని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

