అనపర్తి, ఆగస్టు 3 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
అనపర్తి నియోజకవర్గంలోని చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, స్థానిక చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించేందుకు యునెస్కో సహకారం తీసుకునే దిశగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఐదు చేనేత సొసైటీల ప్రతినిధులు, అధికారులతో సంస్కార్ ఫౌండేషన్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్నతో కలిసి సమావేశం నిర్వహించారు. పులగుర్త మల్కా బ్రాండ్‌కు యునెస్కో సహకారంతో బ్రాండింగ్, మార్కెటింగ్, శిక్షణ అందించి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే యునెస్కో ప్రతినిధులతో సంప్రదింపులు జరిగాయని, త్వరలో ప్రతిపాదన పంపనున్నట్లు చెప్పారు. చేనేత కార్మికులు తయారు చేసిన మోదీ కోటును మంత్రి నారా లోకేష్ ధరించి ప్రచారం చేయడం మంచి గుర్తింపు తెచ్చిందన్నారు. ఇదే సమయంలో అనపర్తిలో నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌లో సుమారు 60 మందికి పరీక్షలు చేయగా ఐదు పాజిటివ్ కేసులు గుర్తించామని తెలిపారు. 2030 నాటికి అనపర్తిని బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్రీ జోన్‌గా తీర్చిదిద్దేందుకు విస్తృతంగా స్క్రీనింగ్, అవగాహన, తదుపరి వైద్య సహాయం అందిస్తామని చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు.


