సత్తుపల్లి / ఖమ్మం
సత్తుపల్లి: మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సండ్ర వెంకట వీరయ్య జన్మదిన వేడుకలను సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ముందుగా సండ్ర క్యాంప్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహిళా నాయకులు కేక్ కట్ చేసి సండ్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
క్యాంప్ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా సత్తుపల్లి బస్స్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కొత్తూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఎన్టీఆర్ కాలనీలో, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజలతో మమేకమై, పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తూ సత్తుపల్లి ప్రజల కోసం నిరంతరం పనిచేసిన సండ్ర నాయకత్వం వర్ధిల్లాలని నాయకులు ఆకాంక్షించారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి ప్రజాసేవలో కొనసాగాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూసంపూడి మహేష్, కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, దొడ్డ శంకరరావు, మోరంపూడి ప్రభాకర్, వీరపనేని బాబీ, షేక్ రఫీ, మల్లూరి అంకంరాజు, సత్తుపల్లి మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు, పట్టణ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



