గాజువాక (పున్నమి ప్రతినిధి): గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నెలిపూడి గంగాదొర (43) అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు కుటుంబంతో కలిసి గాజువాకలో నివసిస్తూ పోర్టులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ నెల 6వ తేదీన గంగాదొర మద్యం సేవించి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డబ్బుల విషయంలో తండ్రి, కుమారుడి మధ్య వివాదం చోటుచేసుకుంది. గొడవను అడ్డుకునే ప్రయత్నంలో కుమారుడు హరీష్ తన తండ్రి మెడను గట్టిగా పట్టుకోవడంతో ఆయన అస్వస్థతకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై మృతుడి అన్న కుమారుడు నెలిపూడి శివ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంగాదొర మృతికి గల అసలు కారణాలను నిర్ధారించేందుకు పోస్టుమార్టం నివేదికతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. విచారణ అనంతరం వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

