విశాఖపట్నం, అక్టోబర్ 16 (పున్నమి ప్రతినిధి): జీవీఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో గాజువాక పరిధిలో తొలిరోజే సందడి నెలకొంది. మొదటి రోజు వైసీపీ అభ్యర్థులు పలువురు నామినేషన్లు దాఖలు చేయగా, ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ సమర్పించారు.
99వ వార్డు నుంచి కోమటి శ్రీనివాసరావు, 94వ వార్డు నుంచి ధర్మాల రాధిక, 87వ వార్డు నుంచి ఉరుకూటి చందు, 96వ వార్డు నుంచి మంత్రి శంకర్ నారాయణ నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే 94వ వార్డు నుంచి పోటీ చేస్తున్న గుడివాడ అనూష మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి వచ్చి నామినేషన్ సమర్పించారు.
కూటమి ప్రభుత్వంపై అమర్నాథ్ విమర్శలు
అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విశాఖలో కబ్జాలు, కార్మికుల తొలగింపులు జరుగుతున్నాయని, స్టీల్ప్లాంట్ కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న సీనియర్ ఎంపీపై రాళ్లు, కర్రలతో దాడి చేసే పరిస్థితి నెలకొందని పేర్కొంటూ, రానున్న ఎన్నికలు ఎలా సాగుతాయో ఆలోచించాలని అన్నారు.
ఎన్నికల్లో అధికార యంత్రాంగాన్ని, పోలీసు, రెవెన్యూ శాఖలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికలను బహిష్కరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, వైఎస్సార్సీపీ మాత్రం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
తొలిరోజు నామినేషన్లతో గాజువాకలో ఎన్నికల వాతావరణం మొదలైంది. రానున్న రోజుల్లో మరింత మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.




