కేశవరం, ఆగస్టు 8 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి అధ్యక్షులు, గ్రామీణ వైద్యులు, శ్రీ వారాహి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ అధినేత డాక్టర్ పెదపాటి విష్ణు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కేశవరం గ్రామంలోని ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్, కూసువారి రామాలయం సమీపంలోని శ్రీ వారాహి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ వద్ద ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ వైద్య శిబిరం జరుగుతుంది. రాజమహేంద్రవరం విజయ్ ఆర్థోపెడిక్ ఆసుపత్రి నుంచి డాక్టర్ టి.వి. రామారెడ్డి, డాక్టర్ జి.వి. ధనుంజయ రెడ్డి, డాక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సుధా మల్లిడి తదితర వైద్య నిపుణులు, రాజమహేంద్రవరం శారదా దంత వైద్యశాల నుంచి డాక్టర్ కంటిపూడి తేజ, డాక్టర్ సంహిత్ వర్మలు హాజరై వైద్య సేవలు అందించనున్నారు.
శివ సత్య ప్రయోగశాల సహకారంతో ఉచిత రక్తవర్గ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. శిబిరంలో ఉచిత రక్తపోటు, రక్తంలో చక్కెర పరీక్షలు, ఎముకలు-కీళ్ల వైద్య పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలు, స్త్రీల వైద్య పరీక్షలు, గుండె-ఊపిరితిత్తుల పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి ఉచిత విద్యుత్ గుండె స్పందన పరీక్ష, దంత పరీక్షలు, దంత వైద్య సలహాలు, ఉచిత మందులు అందించనున్నారు.
మండపేట మండలం కేశవరం గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు, తమ కుటుంబ సభ్యులను కూడా శిబిరానికి తీసుకురావాలని సూచించారు.
సంప్రదింపులకు: 96668 15004



