కావలి పట్టణంలోని కచేరీమెట్టకు చెందిన శ్రీమతి పీట్ల సుకుమారిపై ఇటీవల జరిగిన దాడి ఘటనలో బాధితురాలికి సరైన న్యాయం జరగడం లేదని ఫిర్యాదులు అందడంతో, జనసేన పార్టీ వీరమహిళలు, నాయకులతో కలిసి జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి అళహరి సుధాకర్ ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా బాధితురాలి నుంచి సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం అళహరి సుధాకర్ మాట్లాడుతూ, ఒక మహిళపై ఇలాంటి దారుణమైన దాడి జరగడం అత్యంత బాధాకరమని, ఏ సమస్య ఉన్నా చట్టపరమైన మార్గంలో పరిష్కరించుకోవాలే గానీ ఒక స్త్రీని వివస్త్రురాలిని చేసి దాడి చేయడం సభ్య సమాజం ఎన్నటికీ ఆమోదించదన్నారు. నిందితులు ఏ పార్టీకి చెందిన వారైనా చట్టం ముందు అందరూ సమానమేనని, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై తాను కావలి డీఎస్పీతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో మహిళపై దాడి జరిగినట్లు తేలిందని, సంబంధిత నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారని, త్వరలోనే ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
అలాగే ఇటీవల దగదర్తి మండలంలో కూడా మహిళలపై వరుస దాడులు జరుగుతున్నాయని, కొన్ని సందర్భాల్లో బాధితులపైనే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లగా, వారి ఆదేశాల మేరకు జనసేన వీరమహిళ రాష్ట్ర నాయకురాలు కృష్ణ పెన్నా నాగరత్నం నాయకుడు వెంకట యాదవ్ బాధితులను కలిసి వివరాలు సేకరించారని తెలిపారు. త్వరలో జనసేన లీగల్ సెల్ న్యాయవాదులతో కలిసి దగదర్తి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ రెండు ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలను ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా పార్టీ తరఫున అన్ని విధాలా కృషి చేస్తామని శ్రీ అళహరి సుధాకర్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కృష్ణ పెన్నా నాగరత్నం, వీరమహిళలు కందుల లక్ష్మీ కవిత, కందేపి కవిత, హసీనా, వరలక్ష్మి, పొబ్బ సాయి, సాజిద్ కూడా మాట్లాడి ఖండించారు. ఆషిక్, పోలయ్య, బాబాయ్, నరసింహ, రమణ, హరీష్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు.

