ఒక్క గ్రామంలోనైనా పూర్తిగా రైతు రుణమాఫీ జరిగినట్టు నిరూపించాలి – మాజీ మంత్రి పువ్వాడ
మోసపోతే గోస పడతామన్న కేసీఆర్ మాటలు నిజం అవుతున్నాయి
ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే జరుగబోతోంది
ఈర్లపూడి గ్రామంలో మాజీ మంత్రి పువ్వాడ పర్యటన
జులై 26 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం:
ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని ఈర్లపూడి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. రఘునాథపాలెం మండలంలోని ఏ ఒక్క గ్రామంలోనైనా రైతులందరికీ పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ జరిగిందని నిరూపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును డిమాండ్ చేశారు.
గతంలో కూడా రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగారని, కానీ రైతులకు ఇచ్చిన హామీల అమలుపై మాత్రం స్పష్టత ఇవ్వలేదని ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో లేదు’ అని పువ్వాడ విమర్శించారు.
పాలించే నాయకుడి మనసు మంచిగా ఉంటే ప్రజలంతా సుఖసంతోషాలతో జీవిస్తారని, దానికి నాటి కేసీఆర్ పరిపాలన ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. కేసీఆర్ హయాంలో రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రైతుబంధు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువుల సరఫరా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు సమీపించినప్పుడు మాత్రమే రైతుబంధు నిధులను అరకొరగా జమ చేస్తోందని కేసీఆర్ పాలనలో రైతులకు సులభంగా అందుబాటులో ఉన్న యూరియాను ఇప్పుడు యాప్‌ల పేరుతో అందకుండా చేసి, గతంలో మాదిరిగా ఎరువుల కోసం రైతులు చెప్పులు అరిగేలా క్యూల్లో నిలబడే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ విద్యుత్ కోతలు పెరిగాయని, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం, మోటార్లు కాలిపోవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పంటలకు బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ పూర్తిగా నీరుగారిపోయిందని, రైతులు మరోసారి మోసపోయారని విమర్శించారు.
“మోసపోతే గోస పడతాం” అని కేసీఆర్ గతంలో చెప్పిన మాటలను గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇప్పుడు అదే పరిస్థితిని అనుభవిస్తున్నారని అన్నారు. గత రెండు నెలలుగా వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.


