ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఏఎస్‌పేట పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)గా షేక్ జిలాని బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గత రెండేళ్లుగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఆయన, సాధారణ బదిలీల్లో భాగంగా ఏఎస్‌పేట పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చారు.
పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా చార్జ్ స్వీకరించిన అనంతరం, ఏఎస్‌పేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలో పూజలు చేసి ఆశీర్వాదాలు పొందారు.ఈ సందర్భంగా ఎస్సై షేక్ జిలాని మాట్లాడుతూ, ఏఎస్‌పేట పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెరిగేలా పనిచేస్తానన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామని, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.అలాగే ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్సై జిలాని స్పష్టం చేశారు.


