*ఉచిత విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలి: గోపి రజక*
▪️వేలల్లో పేరుకుపోయిన విద్యుత్ బిల్లులు : పేరూరి బాలస్వామి
▪️అయోమయంలో రజక వృత్తిదారులు:రాసాల లక్ష్మయ్య
కొత్తకోట, ఆగస్టు 17: రజక వృత్తిదారులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించి వృత్తిదారులకు ఊరట కల్పించాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పట్టణ అధ్యక్షులు పేరూరి బాలస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని, అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకానికి సంబంధించిన విద్యుత్ బకాయిలను సకాలంలో చెల్లించకపోవడంతో వృత్తిదారులపై వేల రూపాయల బిల్లులు పేరుకుపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో సోమవారం పట్టణ అధ్యక్షులు పేరూరి బాలస్వామి అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి గోపి రజక , ఇటిక్యాల బండలయ్య ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ఉచిత విద్యుత్ పథకం అమలులో ఏర్పడుతున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా రాసాల లక్ష్మయ్య మాట్లాడుతూ, ప్రజాసంక్షేమ ప్రభుత్వంలో రజక వృత్తిదారులు విద్యుత్ బిల్లుల విషయంలో తీవ్ర అయోమయానికి గురవుతున్నారని అన్నారు. బకాయిలు పెరిగిపోతుండటంతో భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోతే తమ ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందేమోనని వృత్తిదారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
సీనియర్ రజక నాయకులు రాసాల మన్యెం మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అధికారులు బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తామని వృత్తిదారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను గతంలోనే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు.
కార్యక్రమంలో పట్టణ గౌరవ అధ్యక్షులు రాసాల లక్ష్మయ్య,భవాణి చంద్రయ్య ,బి.రవి , బి.శ్రీను ,బి.వెంకటేష్ రిటైర్డ్ ఆర్టీసీ,పేరూరి నాగరాజు,ఆర్ కురుమయ్య,కె.మహేష్ ,ఆర్. నాగరాజు,అప్పరాల శివయ్య తదితరులు పాల్గొన్నారు


