నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుక రవాణా సమయంలో నిర్దేశించిన ప్రమాణాలు పాటించని వాహనదారులపై మున్సిపల్ యాక్ట్ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వై.ఓ నందన్ హెచ్చరించారు.
స్థానిక పొర్లు కట్ట ప్రాంతం ఇసుక రీచ్ నుంచి పొట్టేపాలెం ఇసుక రీచ్ ప్రాంతం వరకు కమిషనర్ బుధవారం పర్యటించి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లతో మాట్లాడారు.
పరిమితికి మించి ఇసుక తరలింపు సమయంలో రోడ్లపై పేరుకుపోయిన ఇసుకను ట్రాక్టర్ డ్రైవర్లకు కమిషనర్ ప్రత్యక్షంగా వీడియో చూపించి వివరణ అడిగారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్ డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఇసుకను తరలిస్తూ రోడ్లపై ఇసుక మేటలు వేసేలా వాహనాలు నడుపుతున్నారని, ఉదయం వేళకు ఆ ఇసుకను రోడ్లపై నుంచి తొలగించేందుకు పారిశుద్ధ్య కార్మికులకు అదనపు పనిభారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక తరలింపు సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డ్రైవర్లను కమిషనర్ హెచ్చరించారు.
కంకర, ఇసుక తదితర భవన నిర్మాణ సామాగ్రి తరలించే సమయంలో లారీలు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు ఇతర వాహనాలపై పూర్తిస్థాయిలో నగరపాలక సంస్థ నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా వాహనాల యజమానులు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు.






