*భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి**రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును కాలరాస్తే సహించేది లేదు: డీసీసీ అధ్యక్షులు గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్*
నరసరావుపేట, సెప్టెంబర్ 30
దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువైన పౌరుల ఓటు హక్కును కాలరాస్తూ ఓట్ల చోరీకి పాల్పడుతున్న భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని పల్నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ డిమాండ్ చేశారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణంలో భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా డీసీసీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మల్లమ్మ సెంటర్ మీదుగా సాగింది. తొలుత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం వైఖరికి వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పౌరుల ఓటు హక్కును కాలరాస్తూ పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరుగుతోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో చేసిన హెచ్చరికలు నేడు అక్షరాలా నిజమయ్యాయని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ పేరుతో దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించిన తీరును స్వయంగా ఎన్నికల కమిషనర్లే అంగీకరించడం దేశ ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న ఈ పోరాటంలో కలిసిరావాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పౌరుడికి రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కు దక్కేంతవరకు కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని ఆయన తేల్చిచెప్పారు.ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు (చిలకలూరిపేట) రాధాకృష్ణ, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు యలమందరెడ్డి, సత్తెనపల్లి ఇన్‌చార్జ్ చంద్రపాల్, నాయకులు ఎస్.ఎం.బాషా,భవానీ వెంకటేష్,శ్రీరామిరెడ్డి, కరీమూన్,అనిల్, ఇమ్మానుయేలు,సత్యం,రవి కిషోర్,కొండలు,రహ్మాన్,బాషా పీర్,సుభానీ,మోహనరావు, జ్ఞానరాజ్ పాల్ తదితర కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


