*ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో తీవ్ర బస్సుల కొరత: కాలం చెల్లిన వాహనాలతో ప్రయాణికుల అష్టకష్టాలు!!*
(ఎన్టీఆర్ జిల్లా), ఇబ్రహీంపట్నం,సెప్టెంబర్ పున్నమి న్యూస్.
నేటి ప్రభుత్వ పరిపాలనలో ప్రజా రవాణా వ్యవస్థకు భారీ గండి పడుతోంది. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో ప్రస్తుతం తీవ్రమైన బస్సుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. నానాటికీ దిగజారుతున్న పరిస్థితుల కారణంగా ఒకప్పుడు కళకళలాడిన ఈ డిపోలో ఇప్పుడు కేవలం తొమ్మిది బస్సులు మాత్రమే మిగిలాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆ ఉన్న తొమ్మిది బస్సులు కూడా కాలం చెల్లినవి కావడంతో, అవి ఎప్పుడు, ఎక్కడ ఆగిపోతాయో తెలియని అయోమయ స్థితి నెలకొంది.
మరమ్మతులకు నోచని వాహనాలు.. మెకానిక్ల అష్టకష్టాలు
డిపోలో ఉన్న వాహనాలకు కనీస మరమ్మతులు చేయడానికి కూడా సరియైన స్పేర్ పార్ట్స్ అందుబాటులో లేకపోవడం గమనార్హం.
ఏదైనా చిన్న సమస్య వచ్చినా విడిభాగాలు దొరక్క మెకానిక్లు అష్టకష్టాలు పడుతున్నారు. అరకొర వసతులతో, తూతూమంత్రంగా బస్సులను రోడ్లపైకి పంపుతుండటంతో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంగా మారింది.
గమ్యస్థానాలు చేరలేక ప్రజల నరకయాతన
బస్సులు ఏ సమయానికి వస్తాయో, అసలు నడుస్తాయో లేదో తెలియక నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దారి మధ్యలో బస్సులు మొరాయించడంతో సమయానికి గమ్యస్థానాలకు చేరలేకపోతున్నారు.
ఈ సమాచారం సరిగ్గా తెలియక, రవాణా సౌకర్యం లేక ప్రజలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు.
ఇది డిపో సిబ్బందికి, ప్రజలకు మధ్య అనవసరమైన అపార్థాలకు మరియు ఘర్షణ వాతావరణానికి దారితీస్తోంది.
*ప్రైవేటీకరణే మేలంటున్న కార్మికులు..!!*
ఆర్టీసీని కాపాడుకోవాలని ఒకప్పుడు పోరాడిన కార్మికులే.. నేడు డిపోలోని దుస్థితిని చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, నిధుల కొరత ఇలాగే కొనసాగితే సంస్థ మనుగడ సాధ్యం కాదని వారు ఆవేదన చెందుతున్నారు.
ఈ అస్తవ్యస్త పరిపాలన కంటే ‘ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తేనే మంచిదేమో’ అనే చర్చ ప్రస్తుతం డిపో వర్కర్లలో బలంగా వినిపిస్తోంది.
పాలకుల ఉదాసీనత వల్లే ఆర్టీసీకి ఈ భారీ గండి పడిందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇబ్రహీంపట్నం డిపోకు కొత్త బస్సులను కేటాయించడంతో పాటు, అవసరమైన స్పేర్ పార్ట్సులను సరఫరా చేసి ప్రయాణికుల కష్టాలను తీర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



