బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన వీరయోధుడు, చారిత్రక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఆగస్టు 18న ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు బీజేపీ OBC మోర్చా జిల్లా అధ్యక్షులు RVS యాదవ్ తెలిపారు.
ఖమ్మం మమతా రోడ్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సామాజిక అణచివేత, స్థానిక భూస్వామ్య ఆధిపత్యం, మొఘల్ రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పాపన్న గౌడ్ తన సొంత సైన్యాన్ని నిర్మించి పోరాడారని, గెరిల్లా యుద్ధం, కోటల ఆధారిత సైనిక వ్యూహాలతో పోరాటం సాగించిన తొలితరం విప్లవ యోధుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని RVS యాదవ్ పిలుపునిచ్చారు.



