మౌలిక వసతులు కరువు.. పట్టించుకోని అధికారులు
మంత్రి పొంగులేటి తక్షణమే హాస్టళ్లను పరిశీలించాలి: గుండా ఉపేందర్‌రెడ్డి
తిరుమలాయపాలెం: సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడబ్ల్యూఎంఎఫ్ జిల్లా ఇన్చార్జి గుండా ఉపేందర్‌రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్‌ను పరిశీలించిన ఆయన.. హాస్టల్లోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా మూత్రశాలలు అపరిశుభ్రంగా ఉండటంతో దుర్గంధం వెదజల్లుతోందని, గదుల్లో కిటికీలు, ఫ్యాన్లు సక్రమంగా లేక విద్యార్థులు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారని తెలిపారు. పారిశుధ్య లోపాలతో విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా సమస్యలు పరిష్కారం కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే మౌలిక వసతులు కల్పించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాస్టళ్లను తక్షణమే పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని గుండా ఉపేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.


