విశాఖపట్నం,( పున్నమి ప్రతినిధి ) 13: ఆగస్టు 22, 23 తేదీల్లో విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జరగనున్న 3వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్–2026 ఓవరాల్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని గురువారం ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమానికి హీరో సుమన్ తల్వార్, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కంచరణ సూర్యనారాయణ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు, మోహన్ సర్, స్పోర్ట్స్ డైరెక్టర్ అప్పలరాజు, ఆనంద బాలు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి హీరో సుమన్ తల్వార్ మాట్లాడుతూ.. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలను పెంపొందిస్తాయని అన్నారు. జాతీయ స్థాయి పోటీల ద్వారా క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునేందుకు మంచి అవకాశం లభిస్తుందని పేర్కొంటూ, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో, విక్టరీ షోటోకాన్–ఇండియా సహకారంతో ఇండియా వడోకై ఈ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తోంది. ప్రధాన నిర్వాహకుడు చిగురుపల్లి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొననున్న ఈ ఛాంపియన్‌షిప్ విశాఖ క్రీడా ఖ్యాతిని మరింత పెంచుతుందని నిర్వాహకులు తెలిపారు.


