వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతలను కాపాడేందుకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం విక్రయాలు, సరఫరాపై 24 గంటల నిషేధం విధించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, ఇతర మద్యం విక్రయించే లేదా సర్వ్ చేసే సంస్థలు 23-09-2026 ఉదయం 6 గంటల నుంచి 24-09-2026 ఉదయం 6 గంటల వరకు పూర్తిగా మూసివేయాల్సి ఉంటుంది.
ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం విక్రయాలు, సరఫరా చేయరాదని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 20 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.



