40 మందికి సైకోసోషల్ ఎడ్యుకేషన్.. బాధితులు, కుటుంబాలకు అండగా ‘సంత్వనా’
విశాఖపట్నం జిల్లా,ఆనందపురం, సెప్టెంబర్ 12 (పున్నమి ప్రతినిధి): వాసవ్య మహిళా మండలి (VMM) ఆధ్వర్యంలో, సంత్వనా కార్యక్రమంలో భాగంగా లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ సహకారంతో ఆనందపురం మండలం బోని గ్రామంలోని కళ్యాణ మండపంలో సైకోసోషల్ ఎడ్యుకేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మానసిక అనారోగ్యంతో జీవిస్తున్న 40 మంది వ్యక్తులు, వారి సంరక్షకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ సత్యారావు మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశమని, బోని గ్రామంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో VMM అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు.
VMM ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎం. అబ్రహాం మానసిక అనారోగ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించుకునే విధానం, సంరక్షకుల బాధ్యతలు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై సూచనలు అందించారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హేమ వివిధ రకాల మానసిక రుగ్మతలు, లక్షణాలు, చికిత్సా విధానాలపై అవగాహన కల్పించారు.
కౌన్సిలర్ యు. రూప మానసిక అనారోగ్యం పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రిలాప్స్ మేనేజ్మెంట్‌తో పాటు అపోహలు, తప్పుడు నమ్మకాలపై అవగాహన కల్పించారు.
అనంతరం బాధితులు, వారి సంరక్షకుల మధ్య పరస్పర సహకారం, అనుభవాల పంచుకోవడం, నిరంతర మద్దతు కోసం రెండు సపోర్ట్ గ్రూపులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బోని ఫీల్డ్ రిసోర్స్ పర్సన్ దుర్గారావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జశ్వంత్, VMM సిబ్బంది నాగరాజు, వెంకట కృష్ణ, పావని, రమణమ్మ, కుమారి తదితరులు పాల్గొన్నారు.
మానసిక అనారోగ్యంపై ఉన్న అపోహలు, వివక్షను తగ్గించి, బాధితులు మరియు వారి కుటుంబాలకు సమాజం నుంచి అవసరమైన అవగాహన, సహకారం, మద్దతు అందించడమే సంత్వనా కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.


