ఖమ్మం జులై
(పున్నమి ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే “మహిళా శిరోమణి అవార్డు” అందుకున్న శ్రీమతి ఉప్పల శారదమ్మకు ఆమె దత్తపుత్రుడు, ఖమ్మం జిల్లా బీజేపీ ఎడ్యుకేషన్ సెల్ కన్వీనర్ ఆచంటి కోటేశ్వరరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం శారదమ్మ ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న సేవలకు ఈ అవార్డు దక్కడం గర్వకారణమని అన్నారు. సమాజ సేవలో ఆమె మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
చరవాణి ద్వార శ్రీమతి ఉప్పల శారదమ్మ మాట్లాడుతూ, తనకు లభించిన “మహిళా శిరోమణి అవార్డు” ఎంతో గౌరవంగా, ఆనందంగా భావిస్తున్నానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం తన జీవితంలో మరపురాని ఘట్టమని పేర్కొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తూ, ఇప్పటివరకు సుమారు 15 వేల మంది మహిళలకు పూర్తిగా ఉచితంగా శిక్షణ అందించి, వారిని స్వయం ఉపాధి దిశగా తీర్చిదిద్దేందుకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
తన సేవా ప్రయాణంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, శిష్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల ఆశీస్సులు, ఆదరణతో భవిష్యత్తులో కూడా మహిళా సాధికారత కోసం మరింత సేవ చేయడానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.



