– డీజేలకు అనుమతి లేదు.. నిబంధనలు పాటించాలి
చిట్వేల్, సెప్టెంబర్ 13: చిట్వేల్ మండలంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని చిట్వేల్ ఎస్సై ఎస్. వినోద్‌కుమార్ సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన ప్రదేశాలను ముందుగానే పరిశీలించడంతోపాటు, నిర్వాహకులతో సమన్వయం చేస్తున్నట్లు చెప్పారు. విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం వేడుకలు నిర్వహించాలని సూచించారు. వినాయక చవితి నిర్వాహకులు ప్రభుత్వం, పోలీసు శాఖ నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. డీజేలకు అనుమతి లేదని, సౌండ్ సిస్టమ్స్ వినియోగంలో నిర్దేశిత శబ్ద పరిమితులు పాటించాలని స్పష్టం చేశారు. ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. మత సామరస్యానికి భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, వివాదాలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలని ఎస్సై కోరారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు లేదా సమస్యలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.


