ఆత్మకూరు ప్రజలకు తాగునీటి కష్టాలు కలిగించిన వ్యక్తి అరెస్ట్
ఆత్మకూరు, జూలై 14 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రభుత్వ వసతులను నాశనం చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. గంగాధర్ రావు హెచ్చరించారు. ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆస్తులను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మంగళవారం సాయంత్రం ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఆత్మకూరు ఇన్చార్జి డీఎస్పీ ఎం. గిరిధర్ రావు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.దర్యాప్తులో భాగంగా అనంతసాగరం మండలం రేవూరు గ్రామానికి చెందిన బోయిళ్ల రవీందర్ రెడ్డి (38), తండ్రి జయచంద్రారెడ్డి, సోమశిల జలాశయం నుంచి ఆత్మకూరు పట్టణానికి తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైప్‌లైన్‌ను 2026 జూలై 7న బోర్వెల్ యంత్రంతో ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లు విచారణలో తేలిందన్నారు.
ఈ ఘటన కారణంగా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 23 వార్డులకు చెందిన సుమారు 25 వేల మంది ప్రజలు తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఐ తెలిపారు. దాదాపు పది రోజుల పాటు సాధారణ నీటి సరఫరా నిలిచిపోవడంతో మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వానికి సుమారు రూ.5 లక్షల వరకు అదనపు వ్యయం జరిగినట్లు వెల్లడించారు.సాంకేతిక ఆధారాలు, ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన ప్రత్యేక బృందం ఆత్మకూరు పట్టణంలోని నెల్లూరుపాళెం సెంటర్ వద్ద అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వల్ల ప్రభుత్వానికే కాకుండా సామాన్య ప్రజలకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందని సీఐ గంగాధర్ రావు పేర్కొన్నారు. ప్రజల పన్నుల రూపంలో నిర్మించిన తాగునీటి వ్యవస్థలు, రహదారులు, విద్యుత్ సౌకర్యాలు వంటి ప్రజా ఆస్తులను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిపై చట్టంలోని కఠిన నిబంధనల ప్రకారం చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
ఈ కేసును త్వరితగతిన ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఆత్మకూరు సీఐ జి. గంగాధర్ రావు, అనంతసాగరం ఎస్ఐ వి. రాజేష్‌తో పాటు ప్రత్యేక బృందంలోని పోలీసు సిబ్బందిని ఆత్మకూరు ఇన్చార్జి డీఎస్పీ ఎం. గిరిధర్ రావు అభినందించారు.ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రభుత్వ వసతులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ, తాగునీటి సరఫరా వ్యవస్థను త్వరితగతిన పునరుద్ధరించేందుకు మున్సిపల్ యంత్రాంగం నిరంతరం పనిచేస్తోందన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి వార్డుకు పరిస్థితిని బట్టి ట్యాంకర్ల ద్వారా కూడా తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు.


