*ప్రత్యేక ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ సవరింపు*
*జూలై 24 వరకు ఇంటింటి సర్వే*
–జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, జూలై 14. (పున్నమి ప్రతినిధి )
భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్షవ్ రెవిషన్ – ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమం షెడ్యూల్‌ను సవరించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ లెవల్ అధికారులు ( బిఎల్ఓ లు) ఇంటింటి సర్వే కార్యక్రమం జూలై 24, 2026 వరకు కొనసాగుతుందని, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణను జూలై 24 నాటికి పూర్తి చేయాలని సూచించిందన్నారు. ముసాయిదా ఓటరు జాబితా జూలై 31న ప్రచురించబడుతుందని, తదుపరి జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారని, వాటి పరిష్కారం సెప్టెంబర్ 28 నాటికి పూర్తిచేసి, అక్టోబర్ 3, 2026న తుది ఓటరు జాబితా ప్రచురించబడుతుందని కలెక్టర్ వివరించారు.
జిల్లాలోని అర్హులైన ప్రతి ఓటరు ఇంటింటి సర్వే సమయంలో బీఎల్‌ఓలకు పూర్తి సహకారం అందించాలని, వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని కలెక్టర్ కోరారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజలు, రాజకీయ పార్టీలు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి, ఓటరు జాబితా ఖచ్చితత్వాన్ని నిర్ధారించాలని ఆయన పిలుపునిచ్చారు.

