ప్రజల ఆరోగ్యం పట్ల అధికారుల నిర్లక్ష్యం తగదు..!
కుమ్మరి కుంటలో చెత్త, దుర్వాసనతో కాలనీవాసుల ఆందోళన
తక్షణ చర్యలు చేపట్టాలని మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి డిమాండ్
హయత్‌నగర్, ఆగస్టు 4:
హయత్‌నగర్ పరిధిలోని కుమ్మరి కుంట చెత్తాచెదారంతో నిండిపోవడంతో పాటు మురుగునీరు నిల్వ ఉండడం, దుర్వాసన వెదజల్లడం, దోమలు విపరీతంగా పెరగడం వల్ల పరిసర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో స్థానిక మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మంగళవారం కుమ్మరి కుంటను ప్రత్యక్షంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
కుంటలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, గృహ చెత్త, మురుగునీరు కారణంగా పరిసర ప్రాంతాల్లో అసహ్యకరమైన దుర్వాసన వెదజల్లుతోందని, దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆయన తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి శాశ్వత చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖలపై ఉన్నప్పటికీ వారు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దోమలు అధికంగా పెరగడం వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, వైరల్ జ్వరాలు వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని విమర్శించారు.
కుమ్మరి కుంటలో పేరుకుపోయిన చెత్తను యుద్ధ ప్రాతిపదికన తొలగించి, మురుగునీటి నిల్వలను తొలగించాలని, ఫాగింగ్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని, యాంటీ లార్వా మందులు పిచికారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కుంటలోకి చెత్త వేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు రక్షణ కంచె ఏర్పాటు చేసి, శాశ్వత పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళికను అమలు చేయాలని కోరారు.
స్థానిక కాలనీల ప్రజలు కూడా ఈ సందర్భంగా తమ సమస్యలను మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజలతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన బాధ్యత అని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కుమ్మరి కుంటను పూర్తిస్థాయిలో శుభ్రపరిచి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా మార్చాలని మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమస్యను నిర్లక్ష్యం చేయకుండా అత్యవసర చర్యలు తీసుకుని ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని ఆయన కోరారు.
Uploaded Video:



