సిగరెట్‌ను మనం తాగుతున్నాం అనుకుంటాం… కానీ నిశ్శబ్దంగా అది మన ఆయుష్షును తగ్గించేస్తూ, జేబుకు పెద్ద చిల్లు పొడుస్తుంది.
ధూమపానం వల్ల సగటున 10 ఏళ్ల నిండు జీవితం బూడిదై గాల్లో కలిసిపోతుంది. గుండెపోటు, పక్షవాతం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఇది గ్యారెంటీగా దారితీస్తుంది. అంతేకాదు, మనం వదిలే పొగను పీల్చి ఇంట్లోని పిల్లలు, కుటుంబ సభ్యులు కూడా రోగాల బారిన పడతారు. పరోక్ష ధూమపానానికి (పాసివ్ స్మోకింగ్) “కొద్దిగా పీల్చినా పర్లేదు” అనే మినహాయింపే లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కుండబద్దలు కొట్టింది. ఈ విషయాలు దాదాపు అందరికీ తెలిసినవే.
కానీ పొగ ఆపితే… శరీరంలో జరిగే గమ్మత్తులు మాత్రం చాలామందికి తెలియవు.
పొగ తాగడం ఆపిన 20 నిమిషాల నుంచే పొగ మహమ్మారి నుంచి కోలుకోవడం ప్రారంభమై, క్రమంగా దాదాపుగా 20 సంవత్సరాల పొగ ప్రభావం నుంచి శరీరం బయటపడుతుంది. ఇదే పొగాకుకు ఉన్నటువంటి ఏకైక మంచి బుద్ధి!
ఈ మంచి బుద్ధిని పరిశీలిద్దాం…
పొగ ఆపిన 20 నిమిషాల్లోనే: వేగంగా కొట్టుకునే గుండె “హమ్మయ్య! వీడు కాస్త గ్యాప్ ఇచ్చాడు” అని కుదుటపడుతుంది. బీపీ, నాడీ వేగం సాధారణ స్థితికి చేరుకోవడం ప్రారంభమవుతుంది.
పొగ ఆపిన 12 గంటల్లో (రక్తంలో ప్రక్షాళన): రక్తంలో పేరుకున్న విషవాయువు (కార్బన్ మోనాక్సైడ్) ఖాళీ అవుతుంది. కణాలన్నింటికీ తాజా ఆక్సిజన్ సరఫరా మొదలవుతుంది.
పొగ ఆపిన 48 గంటల్లో (నాలుకకు పండగ): బూడిద వాసనతో నాలుకపై నిద్రాణమై ఉన్న రుచి మొగ్గలు మేల్కొంటాయి. ఇంట్లో పప్పుచారు కూడా బిర్యానీ అంత రుచిగా అనిపిస్తుంది!
2 నుండి 12 వారాల్లో (ఇంజిన్ ఊపందుకుంటుంది): రక్త ప్రసరణ బాగుపడి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. నాలుగు అడుగులు వేయగానే ఆయాసం రావడం తగ్గి, నడకలో హుషారు వస్తుంది.
నెల నుంచి 9 నెలల్లో (లారీ హారన్ బంద్): ఉదయాన్నే మొదలయ్యే ‘ఖో.. ఖో..’ దగ్గులు సర్దుకుంటాయి. ఊపిరితిత్తుల్లోని సహజసిద్ధమైన చీపుర్లు (సిలియా) తిరిగి పెరిగి, చురుగ్గా పనిచేస్తూ లోపలి మురికిని క్లీన్ చేయడం ప్రారంభిస్తాయి.
1 సంవత్సరంలో (గుండెకు రక్షణ కవచం): గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం అమాంతం 50% తగ్గిపోతుంది.
5 నుండి 15 ఏళ్లలో (యముడికి లాంగ్ లీవ్): పక్షవాతం, క్యాన్సర్ భయాలు పటాపంచలవుతాయి.
15 ఏళ్లు పూర్తయ్యేసరికి: మీ గుండె… అసలు సిగరెట్ ముట్టని ఆరోగ్యవంతుడి గుండెలా పూర్తి ఆరోగ్యంగా మారుతుంది!
ఇంకా ఎన్ని లాభాలంటే?
40 ఏళ్ల లోపే మానేస్తే: ధూమపానం వల్ల కోల్పోతామనుకున్న 10 ఏళ్ల ఆయుష్షులో 90 శాతం ఆయుష్షు మళ్లీ మన ఖాతాలో పడుతుంది.
జేబులో లక్ష్మీదేవి: రోజూ పొగబెట్టే ₹100 ఆపినా, ఏడాదికి ₹36,000 మిగులుతాయి. ఇంట్లో పిల్లల చదువుకో, బంగారు ముక్కకో పనికొస్తాయి.
దొంగచాటు బతుకు ఖతం: పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో బాత్రూమ్ల వెనక, మురికి గోడల సందుల్లో దొంగలా దాక్కునే అవసరం తప్పుతుంది. పదిమందిలో కాలర్ ఎగరేసి తిరగొచ్చు!
బయటపడడం ఎలా?
నికోటిన్ ఒక మాయదారి వ్యసనం. దాన్ని వదిలించుకోవడానికి కాస్త పట్టుదల, సరైన పద్ధతి కావాలి. వైద్యుల సలహాతో నికోటిన్ ప్యాచ్‌లు, చూయింగ్‌గమ్‌లు లేదా మందులు వాడొచ్చు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తీసుకుంటూ, పొగతాగే స్నేహితుల గుంపులకు కొన్ని నెలలపాటు దూరంగా ఉండాలి.
ధూమపానానికి దూరంగా ఉందాం — ఆరోగ్యానికి దగ్గరవుదాం!
— డాక్టర్ ఎం.వి.రమణయ్య
