ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం కాకొల్లువారిపల్లెలో ‘పల్లెపండుగ–3.0’ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం రాక నేపథ్యంలో అధికారులు, పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం, పార్కింగ్, హెలిప్యాడ్, ప్రజలకు అవసరమైన వసతులను సిద్ధం చేశారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. స్థానికంగా సందడి నెలకొంది.



