శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే ప్రథమ ప్రాధాన్యం
నరసరావుపేట, సెప్టెంబర్ 24
పల్నాడు జిల్లా నూతన జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)గా జగదీష్ ఆదహళ్లి గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు,సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణ అనంతరం సిబ్బందితో పరిచయ కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ, జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, పోలీసు శాఖ పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు వేగవంతమైన, మెరుగైన పోలీసు సేవలు అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది అంతా పరస్పర సమన్వయంతో, అంకితభావంతో విధులు నిర్వహించి పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


