పంట కోతల తర్వాత మిగిలే పొగాకు, వరి, మొక్కజొన్న వంటి పంట వ్యర్థాలను పొలాల్లో తగలబెట్టడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీనివల్ల నేలలోని తేమ ఆవిరై, పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయి. అంతేకాకుండా, మంటల వల్ల గ్రీన్హౌస్ వాయువులు విడుదలై కాలుష్యం పెరుగుతుంది.
వ్యర్థాలను తగలబెట్టే బదులు భూమిలో కలిపి దున్నడం వల్ల నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి సేంద్రియ కర్బనం లభించి భూమి సారవంతమవుతుంది. తద్వారా ఎరువుల వాడకం తగ్గి, పంట దిగుబడి పెరుగుతుంది. పంట వ్యర్థాల నిర్వహణ యంత్రాలపై ప్రభుత్వం రాయితీలు అందిస్తూ రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.


