Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నగరంలో పడకేసిన పారిశుధ్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నగరంలో పడకేసిన పారిశుధ్యం

వార్త ముఖ్యాంశాలు

  • - అస్తవ్యస్తంగా డోర్ టు డోర్ చెత్త సేకరణ - ప్రకటనలు గొప్ప..
  • క్షేత్రస్థాయిలో ఆచరణ శూన్యం - ప్రకటనలకే పరిమితమైన స్వచ్ఛ నెల్లూరు - ఏ వీధిలో, ఏ ఖాళీ ప్లాట్‌లో చూసినా చెత్త కంపే - సిల్ట్ తీయని కాలువలతో నగరంలో దుర్గంధం - వ్యవస్థ ఉన్నా అవస్థలపాలే - పర్యవేక్షణ కరువు నెల్లూరు నగరంలో రోజురోజుకీ పారిశుధ్యం…
  • నగరపాలక సంస్థగా మారి సుమారు 20 ఏళ్లు కావస్తున్నా చెత్త కంపు, సిల్ట్ సమస్యలతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటే కార్పొరేషన్ పర్యవేక్షణ వ్యవస్థ ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

– అస్తవ్యస్తంగా డోర్ టు డోర్ చెత్త సేకరణ
– ప్రకటనలు గొప్ప.. క్షేత్రస్థాయిలో ఆచరణ శూన్యం
– ప్రకటనలకే పరిమితమైన స్వచ్ఛ నెల్లూరు
– ఏ వీధిలో, ఏ ఖాళీ ప్లాట్‌లో చూసినా చెత్త కంపే
– సిల్ట్ తీయని కాలువలతో నగరంలో దుర్గంధం
– వ్యవస్థ ఉన్నా అవస్థలపాలే
– పర్యవేక్షణ కరువు

నెల్లూరు నగరంలో రోజురోజుకీ పారిశుధ్యం దిగజారిపోతోంది. నగరపాలక సంస్థగా మారి సుమారు 20 ఏళ్లు కావస్తున్నా చెత్త కంపు, సిల్ట్ సమస్యలతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటే కార్పొరేషన్ పర్యవేక్షణ వ్యవస్థ ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల నుంచి పన్నుల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నా, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో కార్పొరేషన్ అధికారులు విఫలమవుతున్నారు. కార్పొరేషన్‌లోని పారిశుధ్య వ్యవస్థ పనితీరు మాటల్లో తప్ప చేతల్లో కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పారిశుధ్యం రోజురోజుకీ దిగజారుతోంది.

ఇటీవలైతే ఎన్నికలను సాకుగా చూపి దాదాపు నెల రోజుల నుంచి పారిశుధ్యం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. డోర్ టు డోర్ చెత్త సేకరణ అంటూ పేర్లు చెబుతున్నారు కానీ ప్రతినిత్యం ఇంటింటి చెత్త సేకరణ జరగడం లేదు. అడుగున్నరలోపు వెడల్పున్న మురుగు కాలువ నుంచి తీసిన సిల్ట్ ఎండిపోయినా, నెలల తరబడి రోడ్లపై నుంచి తొలగించడం లేదు.

నెల్లూరు నగరం ప్రస్తుతం 166 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా, కొత్తగా 72 డివిజన్లు వచ్చి చేరాయి. 8 నుంచి 9 లక్షల మంది నివసిస్తున్నారు. ప్రతిరోజూ నగరంలో 320 మెట్రిక్ టన్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను ఏ రోజుకారోజు సేకరించి, నగరానికి దూరంగా ఉన్న దొంతాలి డంపింగ్ యార్డుకు తరలించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంపై ఉంది.

నగర పరిధిలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు, పర్యవేక్షణ సిబ్బందికి కలిపి ప్రతి నెలా రూ.2.50 కోట్లు జీతాల రూపంలో చెల్లిస్తున్నారు. ఇదే కాకుండా చెత్త సేకరణ వాహనాల లీజులు, ఆయిల్ తదితర ఖర్చుల పేరుతో నెలకు రూ.1.25 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చంతా లెక్కల్లోనే ఉంటోంది. క్షేత్రస్థాయిలో ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు.

నగరంలో 21 శానిటరీ డివిజన్లు, 166 సచివాలయాలు ఉండగా, పారిశుధ్య విభాగంలో 877 మంది యూపీసీఏఎస్ కార్మికులు, 300 మందికి పైగా శాశ్వత కార్మికులు, 200 మంది వరకు కాంట్రాక్టు కార్మికులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. శాశ్వత కార్మికులకు నెలకు రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు జీతాలు ఇస్తున్నారు. అయితే వారిలో చాలామంది ఆ జీతాలను నెలనెలా తీసుకుంటూ, నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు ఇచ్చి బదులు కార్మికులను క్షేత్రస్థాయిలో వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒకరికి బదులు మరొకరు క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులు చేస్తున్న విషయం సంబంధిత పర్యవేక్షకులకు తెలిసినా నోరు మెదపడం లేదంటే, వారి మధ్య ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ ఉందో అర్థమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కార్మికులు 200 మందికి పైగా ఉన్నట్లు అనధికార లెక్కలు చెబుతున్నాయి.

యూపీసీఏఎస్ కార్మికులకు నెలకు రూ.21 వేల జీతం చెల్లిస్తున్నారు. వారిలోనూ కొందరు జీతాలు తీసుకుంటూ అనేక చోట్ల పారిశుధ్య పనులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉదయాన్నే హాజరు వేసుకుని వెళ్లిపోతున్నారని, క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని చెబుతున్నారు. కొందరు మేస్త్రీలకు చెందిన కుటుంబ సభ్యులు హాజరు వేసుకుని ఇళ్లకు వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు సమయాలు పాటించకుండా ఉదయం 9 గంటలకే పనులు ముగించుకుని, వీధులను వదిలేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇక రెండో పూట, మధ్యాహ్నం తర్వాత చాలామంది పనుల్లో కనిపించడం లేదు.

నెల్లూరు నగర పారిశుధ్యంలో పర్యవేక్షణ పూర్తిగా అడుగంటిపోయింది. పట్టించుకునే నాథుడే లేడు. కమిషనర్ ఎన్నికల విధుల్లో పడి పారిశుధ్యంపై కన్నేయడం మానేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చిన్న బజారు, పెద్ద బజారు, కొరడా వీధి, గరిసి వీధి, జెండా వీధి, మన్సూర్ నగర్, ఖుద్దూస్ నగర్, వైఎస్సార్ నగర్, రామకోటయ్య నగర్, బుజబుజ నెల్లూరు, నాగమ్మ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, అయ్యప్ప గుడి పరిసరాలు, జ్యోతినగర్, పడారుపల్లి, వికలాంగుల కాలనీ, కోడూరుపాడు, నారాయణరెడ్డిపేట, అశోక్ నగర్, దీనదయాళ్ నగర్, నవలాకుల గార్డెన్స్, కల్తీ కాలనీ, ధనలక్ష్మీపురం, చింతారెడ్డిపాలెం, రాజుపాలెం, కలివెలపాలెం తదితర ప్రాంతాల్లో పారిశుధ్యం ఘోరంగా తయారైంది. అయినా పట్టించుకునే నాథుడే లేడు.

ఒకరికి బదులు మరొకరు పనిచేయడం చాలా మామూలైపోయింది. హాజరు వేస్తే చాలు, పని చేసినా చేయకపోయినా మన జీతాలు మనకు వస్తాయిలే అన్న ధీమాతో కొందరు కార్మికులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఎంహెచ్‌వో అనే ఓ ఉన్నతాధికారి, ఆయన తర్వాత శానిటరీ సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు, సచివాలయాల పారిశుధ్య కార్యదర్శులు ఎందరున్నా ఏం ప్రయోజనం లేకుండా పోతోంది.

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ సొంత కార్పొరేషన్ రోజురోజుకీ మురికికూపంగా మారుతోంది. ఖాళీ స్థలాలు చెత్తతో పేరుకుపోతున్నాయి. కాలువల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. అసలు ఇది కార్పొరేషనా? కంపుకొట్టే నగరమా? అన్న విధంగా ప్రస్తుతం నెల్లూరు నగరం తయారైంది. మంత్రి పట్టించుకోరు, అధికారులు వినిపించుకోరు, కార్మికులు పూర్తిస్థాయిలో పనిచేయరు. ప్రజలు మాత్రం ఎవరి చావు వారు చస్తున్నారు.

ఇప్పటికైనా పైన పేర్కొన్న అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్లక్ష్యంగా పనిచేస్తున్న ఎంహెచ్‌వో తన నిర్లక్ష్యాన్ని వదిలించుకోవాల్సి ఉంది. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *