తెగిపడిన 11 కేవీ వైరు.. మహిళా రైతు మృతి…
మూడు రోజులుగా వైరు తెగి ఉన్నా పట్టించుకోలేదని గ్రామస్తుల ఆరోపణ..
చేజర్ల మండలం నాగులవెల్లటూరులో విషాదం..
చేజర్ల, (జర్నలిస్ట్ తిరుపతి రెడ్డి)
చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామంలో గురువారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. నిమ్మతోటలో మోటార్ వేసేందుకు వెళ్లిన మహిళా రైతు ముప్పసాని కామాక్షమ్మ తెగిపడిన 11 కేవీ విద్యుత్ వైరు తగిలి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు.మూడు రోజుల క్రితం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిన సమయంలో నాగులవెల్లటూరు పరిధిలోని నిమ్మతోటల వైపు వెళ్తున్న 11 కేవీ విద్యుత్ వైరు తెగిపోయి ఉండవచ్చని గ్రామస్తులు చెబుతున్నారు. అప్పటి నుంచి గ్రామంలో త్రీఫేస్ విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని వారు పేర్కొన్నారు.అయితే తెగిపోయిన వైరు విషయాన్ని సంబంధిత విద్యుత్ సిబ్బంది గుర్తించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.గురువారం ఉదయం రోజువారీ వ్యవసాయ పనుల్లో భాగంగా కామాక్షమ్మ తన నిమ్మతోటకు వెళ్లారు.తోటలోని మోటార్‌ను ఆన్ చేసేందుకు వెళ్తున్న సమయంలో నేలపై తెగిపడి ఉన్న 11 కేవీ విద్యుత్ వైరు ఆమెకు కనిపించకపోవడంతో దానిని తాకినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.

విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి..
వైరు తగలడంతో కామాక్షమ్మకు ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. విద్యుత్ ప్రవాహ తీవ్రతకు ఆమె తీవ్రంగా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉందంటే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.కామాక్షమ్మ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం తోటకు వెళ్లి చూడగా మృతి చెంది కనిపించారు. దీంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం గ్రామంలో వ్యాపించడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమా?..
తమ గ్రామ పరిధిలో విద్యుత్ వైరు మూడు రోజులుగా తెగిపడి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు, సిబ్బంది సక్రమంగా స్పందించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.తెగిపోయిన 11 కేవీ వైరు గురించి ముందుగానే గుర్తించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఉంటే ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉండేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే వైరు ఎప్పుడు తెగింది, దాని గురించి విద్యుత్ శాఖకు సమాచారం అందిందా? విద్యుత్ సరఫరా ఎందుకు కొనసాగింది? ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలేమిటి? అనే అంశాలు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా మండలంలో చాలా గ్రామాల్లో విద్యుత్ సమస్యలపై రైతులు ఫోన్ చేసినా.. అధికారులు సిబ్బంది అందుబాటులోకి రారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ కు విద్యుత్ శాఖ అధికారులు హాజరైన దాఖలాలు లేవని అధికారులు తెలియజేస్తున్నారు.మండలంలో జరిగే సాధారణ సర్వసభ్య సమావేశాలకు కూడా డుమ్మా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. దీన్నిబట్టి విద్యుత్ శాఖ అధికారుల పని తీరు ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
పోలీసులకు ఫిర్యాదు..
కామాక్షమ్మ మృతిపై ఆమె కుమారుడు చేజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా సంఘటనపై పరిశీలన జరిపి బాధ్యతకు సంబంధించిన అంశాలను స్పష్టం చేయాల్సి ఉంది.మహిళా రైతు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందడంతో నాగులవెల్లటూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


