తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ముగ్గురు చిన్నారులు.. దాతల సహాయం కోసం ఎదురుచూపులు
బెజ్జూర్, జూలై 28: కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం అంబగట్ట గ్రామపంచాయతీ పరిధిలోని రేచిని గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ పెద్దలు వరుసగా మృతి చెందడంతో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు.
గ్రామానికి చెందిన ఆదే భీమ్రావు గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందారు. అనంతరం ఆయన భార్య ఆదే తిరుపతమ్మ కూడా ఈ నెల 27న అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో వారి ముగ్గురు పిల్లలు—అనూష (10), అయాన్ (7), రిషి వర్ధన్ (4)—తల్లిదండ్రులను కోల్పోయి దిక్కులేని స్థితిలో మిగిలారు.
ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దాతలు, సేవా సంస్థలు, ప్రజలు ముందుకు వచ్చి ఆర్థికంగా, నిత్యావసర వస్తువుల రూపంలో సహాయం అందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే మృతురాలి ఇంట్లో నిర్వహించే కర్మకాండలకు కూడా తమకు తోచిన సహాయాన్ని అందించాలని కోరుతున్నారు.
ఆర్థిక సహాయం అందించదలచిన వారు 6300005645 లేదా 6300766855 ఫోన్‌పే నంబర్ల ద్వారా విరాళాలు పంపవచ్చని నిర్వాహకులు తెలిపారు. వస్తు సామగ్రి అందించదలచిన వారు రేచిని గ్రామంలోని బాధితుల ఇంటికి నేరుగా అందించవచ్చని, లేదా సంబంధిత ఫోన్ నంబర్లను సంప్రదిస్తే బెజ్జూర్ మండల కేంద్రం నుంచి వాటిని బాధిత కుటుంబానికి చేరేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
చిన్నారులకు అండగా నిలవాలని, వారి భవిష్యత్తుకు చేయూతనివ్వాలని స్థానికులు మానవతా దృక్పథంతో ప్రజలను కోరుతున్నారు.


