అనంతగిరి మండల కేంద్రంలోని డముకు పరిసర ప్రాంతంలో ప్రతి బుధవారం నిర్వహించే వారపు సంతకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.సంత జరిగే ప్రదేశానికి సమీపంలోని రహదారి వర్షపు నీటితో చెరువును తలపించేలా మారడంతో ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
వర్షాలు కురిసిన ప్రతిసారీ రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో సంతకు వచ్చే ప్రజలు నడిచేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆదివాసీ పరిరక్షణ సమితి అనంతగిరి మండల అధ్యక్షులు సోమేల స్వామి తెలిపారు.
ఈ సమస్యపై పలుమార్లు నాయకులు, ప్రజాప్రతినిధులు R&B అధికారులకు వినతిపత్రాలు అందజేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా R&B అధికారులు సమస్యను గుర్తించి ఉన్నతాధికారులు, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి రహదారిపై నీరు నిలవకుండా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
డముకు సంత ప్రాంగణం ప్రజలకు ఎంతో కీలకమైన ప్రాంతమని, వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా డ్రైనేజీ, రహదారి అభివృద్ధి పనులను చేపట్టాలని కోరారు.
ఈ సమస్యను ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి, నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలని నాయకులు, ప్రజాప్రతినిధులకు సోమేల స్వామి విజ్ఞప్తి చేశారు.



