ఆత్మకూరు (హరికిరణ్ ప్రతినిధి): ఆత్మకూరు పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రాకపోకల కారణంగా సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గురువారం సాయంత్రం సీఐ గంగాధర్, ఎస్సై జంపని కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారులు, వ్యాపార ప్రాంతాలు, రద్దీ కూడళ్లలో ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాన వీధిలోని షాపుల ఎదుట వాహనాలు నిలిపివేయడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని గుర్తించారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో కొనుగోళ్ల కోసం వచ్చే ప్రజలు రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. వాహనదారులు తమ వాహనాలను రోడ్డుకు అవతల లేదా ఖాళీ ప్రదేశాల్లో నిలిపి, కొనుగోళ్లు పూర్తి చేసుకుని వెళ్లాలని సూచించారు.
అదేవిధంగా ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు, వ్యాపారులకు కూడా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముఖ్య కూడళ్ల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తామని సీఐ గంగాధర్ తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నియమాలు పాటిస్తే రద్దీ సమస్యలు తగ్గడంతో పాటు ప్రమాదాలను కూడా నివారించవచ్చన్నారు.
పట్టణ అభివృద్ధికి అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేస్తున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని సీఐ స్పష్టం చేశారు.


