శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్తు 72వ జాతీయ నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభం
తిరుపతి ఆగస్టు 03 (పున్నమి ప్రతినిధి)
తిరుపతి ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా భారతీయ కళలు, సంస్కృతికి నిలయమని, కళలను పరిరక్షించి ప్రోత్సహించే ప్రతి సంస్థకు టీటీడీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు.తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సోమవారం ప్రారంభమైన శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్తు 72వ జాతీయ నాటకోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కళాకారులకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం, టీటీడీ నిరంతరం కట్టుబడి ఉన్నాయని తెలిపారు. పౌరాణిక, సాంఘిక నాటకాలు, ఏకపాత్రాభినయం, లలిత సంగీత పోటీల నిర్వహణ అభినందనీయమన్నారు. గత ఆరు సంవత్సరాలుగా నిలిచిపోయిన నాటకోత్సవాలను ఈ ఏడాది టీటీడీ అందించిన రూ.25 లక్షల ఆర్థిక సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ కళలకు, కళాకారులకు టీటీడీ ఇదే విధంగా అండగా నిలవాలని ఆకాంక్షించారు.
ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గరుడ అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ, కళలను ఆదరించే సమాజంలోనే సంస్కృతి, సాంప్రదాయాలు, సుఖశాంతులు వర్ధిల్లుతాయని పేర్కొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ టి. రవి మాట్లాడుతూ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య, దాససాహిత్య ప్రాజెక్టుల ద్వారా టీటీడీ కళాకారులకు విశేష ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదనీరాజనం, ఎస్వీబీసీ వంటి వేదికల ద్వారా సంగీత, నాటక, సాంస్కృతిక రంగాలకు మరింత ఊతమిస్తున్నామని తెలిపారు. తిరుపతి, తిరుమలలో ఎస్వీబీసీ ఆధ్వర్యంలో ప్రతి వారం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలను టీటీడీ పరిశీలిస్తోందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ గౌరవాధ్యక్షులు చిన్నంగారి రమణ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, కార్యదర్శి మునిరత్నం, నగర ప్రముఖులు మబ్బు సూర్యనారాయణ రెడ్డి, కుమారస్వామి రెడ్డి, కళాపరిషత్ ప్రతినిధులు, కళాకారులు, కళాభిమానులు, పెద్ద సంఖ్యలో పురప్రజలు పాల్గొన్నారు.



