విజయవాడ నగర పోలీసులు సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడానికి ‘ఖాకీ స్టూడియో’ పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్న సైబర్ మోసాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు ఈ స్టూడియో ద్వారా AI (కృత్రిమ మేధ) ఆధారిత లఘు చిత్రాలు (షార్ట్ ఫిలిమ్స్), పోస్టర్లను రూపొందించనున్నారు.
దీనికోసం ప్రతి పోలీస్ స్టేషన్ నుండి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్ విభాగాల నుండి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న 45 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. వీరికి విశాఖపట్నం నుండి వచ్చిన ప్రత్యేక శిక్షకుడితో ఐదు రోజుల పాటు AI టూల్స్ వినియోగం, వీడియోల తయారీపై పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభమైంది. ఇకపై బయటి వ్యక్తుల సహాయం లేకుండా సొంత సిబ్బందితోనే ఈ వీడియోలను తయారు చేయనున్నారు.


