50 పడకల 24/7 అత్యాధునిక వైద్య సేవలకు శ్రీకారం
విశాఖపట్నం, సెప్టెంబర్ 12: (పున్నమి ప్రతినిధి)
విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)లో మరో కీలక వైద్య సదుపాయం అందుబాటులోకి వచ్చింది. రూ.23.75 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు అంతస్తుల్లో నిర్మించిన 50 పడకల 24/7 క్రిటికల్ కేర్ బ్లాక్‌ను కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ యాదవ్, విష్ణుకుమార్ రాజు, ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు చైర్మన్ సీతంరాజు సుధాకర్, నాయకులు పరశురామ రాజు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, కేజీహెచ్ సూపరింటెండెంట్ డా.వాణి, ఏఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, అడ్మినిస్ట్రేటర్ రమణ తదితరులు హాజరయ్యారు.



