*ఏపీలో ఎంపీ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి: సీఎం చంద్రబాబు*
కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు 50 శాతం పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
డీలిమిటేషన్ అనంతరం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలు 38కి పెరుగుతాయని తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో 17 నుంచి 26కు, తమిళనాడులో 39 నుంచి 59కు, కర్ణాటకలో 28 నుంచి 42కు, కేరళలో 20 నుంచి 30కి ఎంపీ స్థానాలు పెరుగుతాయని వివరించారు.
ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో మొత్తం 129 లోక్సభ స్థానాలు ఉండగా, డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం ఆ సంఖ్య 195కి చేరుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

