కళ్యాణమండపం ప్రారంభోత్సవం, ఆలయ మరమ్మతులు, రెండో అర్చకుని నియామకం, సామూహిక సత్యనారాయణ వ్రతంపై సానుకూల హామీ
ఆత్మకూరు, జూలై 5 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ని ఆత్మకూరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగానాథస్వామి దేవస్థానం భక్తబృందం ఆదివారం నెల్లూరు లోని అయన నివాసంవద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు .ఈ సందర్భంగా భక్తుల విరాళాలు, సహాయ సహకారాలతో నిర్మించిన స్వామివారి కళ్యాణమండపం పైఅంతస్తు ప్రారంభోత్సవం గురించి మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగస్టు మొదటి వారంలో శుభ ముహూర్తాన్ని నిర్ణయించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా దేవస్థానంలో అత్యవసరంగా చేపట్టాల్సిన చిన్నచిన్న మరమ్మతులు, మౌలిక వసతుల అభివృద్ధికి దేవాదాయ శాఖ ద్వారా అవసరమైన సహాయాన్ని అందించాలని భక్తబృందం కోరింది. ఈ అంశంపై మంత్రి వెంటనే స్పందిస్తూ సంబంధిత దేవాదాయ శాఖ అధికారులను ఆలయానికి పంపించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.దేవస్థానంలో నిత్యపూజలు, ఉత్సవాలు, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు విస్తరించిన నేపథ్యంలో రెండో అర్చకునికి జీతభత్యాలు మంజూరు చేయాలని భక్తులు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, నిబంధనల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ఆత్మకూరు భక్తుల చిరకాల కోరిక అయిన అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆత్మకూరులో నిర్వహించే అంశాన్ని కూడా భక్తబృందం మంత్రి దృష్టికి తీసుకువచ్చింది. దీనిపై స్పందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా అన్నవరం దేవస్థానం అధికారులతో చర్చించి, త్వరలోనే అనుకూల తేదీని నిర్ణయించి ఆత్మకూరులో వేలాది మంది భక్తుల సమక్షంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే స్వామివారి కళ్యాణమండపం పరిసర ప్రాంతంలో విద్యుత్ లోడ్ సమస్య తీవ్రంగా ఉన్న విషయాన్ని భక్తులు వివరించారు. భవిష్యత్తులో పెద్దఎత్తున వివాహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే నేపథ్యంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించి సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.సమావేశం సందర్భంగా దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంతో ఓపికగా విని, భక్తబృందం సూచనలు, అభిప్రాయాలను సవివరంగా తెలుసుకుని సానుకూలంగా స్పందించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, నిత్య ధార్మిక కార్యక్రమాల విస్తరణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని భరోసా ఇచ్చారు.
మంత్రి తమ విలువైన సమయాన్ని కేటాయించి దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశాన్ని శ్రద్ధగా పరిశీలించి, తక్షణ చర్యలకు హామీ ఇవ్వడం పట్ల దేవస్థానం కమిటీ సభ్యులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కుడుముల సుధాకర్, రెడ్డి,సోమవరపు యానాది రెడ్డి,నున్న సంతోష్ కుమారు,ఏలూరు రాజగోపాల్ రెడ్డి,పొన్నూరు హరికృష్ణ,పెళ్లూరు వెంకటేశ్వర్లు,ఇందూరు వెంకటేశ్వర్ రెడ్డి,పందిపాటి సుధాకర్ రెడ్డి తదితరులున్నారు.


