జడ్పీ నిధులతో ఏర్పాటు చేసిన బోర్లను ప్రారంభించిన జడ్పీటీసీ ప్రసన్నలక్ష్మి – కాలనీవాసుల్లో హర్షం
ఆత్మకూరు, జూన్ 9 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు రూరల్ మండలంలోని అప్పారావుపాలెం గ్రామ ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి జడ్పీ నిధులతో ఏర్పాటు చేసిన తాగునీటి బోర్లను మంగళవారం జడ్పీటీసీ సభ్యురాలు ప్రసన్నలక్ష్మి ప్రారంభించారు. అధికారుల సమక్షంలో టెంకాయ కొట్టి బోర్లను ప్రారంభించడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.ఎన్నో రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఎస్సీ కాలనీ ప్రజలకు ఈ బోర్లు అందుబాటులోకి రావడం వల్ల తాగునీటి కష్టాలు గణనీయంగా తగ్గనున్నాయి. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి జడ్పీ నిధుల ద్వారా ఈ బోర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు జడ్పీటీసీ ప్రసన్నలక్ష్మి తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుధ్యం, రహదారులు వంటి ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు అవసరమైన మరిన్ని అభివృద్ధి పనులను కూడా దశలవారీగా చేపడతామని హామీ ఇచ్చారు.ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు బోర్ల నిర్మాణం, నీటి లభ్యతకు సంబంధించిన వివరాలను ప్రజలకు వివరించారు. బోర్లను సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు వాటి నిర్వహణలో కూడా గ్రామస్తులు సహకరించాలని సూచించారు.తాగునీటి బోర్లు ప్రారంభం కావడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. వేసవి కాలంలో తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులు ఇకపై తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి రమేష్, గ్రామ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు చండ్ర హజరత్ నాయుడు, రైతు విభాగ అధ్యక్షుడు చండ్ర శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీహరి, మైనారిటీ అధ్యక్షుడు సర్దార్ భాయ్, ఎస్సీ సెల్ నాయకులు బ్రహ్మయ్య, ప్రభాకర్, హజరత్, వెంకటేష్, సునీత, వెన్నల తదితరులు పాల్గొన్నారు.


