ఓబులవారిపల్లి: అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 10, 11 తేదీల్లో సూళ్లూరుపేటలో నిర్వహించనున్న తిరుపతి జిల్లా అంగన్వాడీ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఓబులవారిపల్లి మండలం చిన్నవరం పాడు పంచాయతీలో మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ నాయకుడు సీహెచ్. చంద్రశేఖర్, కోడూరు ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎన్. రమాదేవి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాధాకుమారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభల్లో విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు యాప్‌ల పనిభారం తగ్గించాలని కోరారు.
గతంలో అంగన్వాడీలు 42 రోజులపాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. వేతనాల పెంపుపై గతంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సమస్యల పరిష్కారానికి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మహాసభలకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో స్వర్ణలత, వాణి, శంకరమ్మ, వరలక్ష్మి, అంజనమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.


