వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు, కోడూరు రూరల్ సీఐ శ్రీ డి. శ్రీనివాసులు, చిట్వేల్ ఎస్ఐ శ్రీ ఎస్. వినోద్ కుమార్లు మండలంలోని సిద్ధారెడ్డిపల్లి, వెంకటరాజపురం గ్రామాల్లో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల వినాయక కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఊరేగింపులను శాంతియుతంగా నిర్వహించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూడాలని సూచించారు.
పండుగ నిర్వహణలో కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, పరస్పర సమన్వయంతో వినాయక చవితి వేడుకలను సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని అధికారులు కోరారు.


