80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆమె, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి పౌరుడు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి పౌరుడికి సమానంగా అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.
భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ గౌరవించాలని రాష్ట్రపతి సూచించారు. న్యాయ వ్యవస్థ, చట్టసభల గౌరవాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని, జాతీయ గీతాలు, దేశభక్తి భావాలను గౌరవించాలని అన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, న్యాయం, సామాజిక అభివృద్ధి కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత తమ స్వప్నాలను సాకారం చేసుకునేందుకు పట్టుదలతో కృషి చేయాలని హితవు పలికారు. దేశ ప్రగతిలో యువత, మహిళలు, రైతులు, కార్మికుల పాత్ర కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.


