Date 01-10-2026
నందిపాడు (పున్నమి ప్రతినిధి,)
దుత్తలూరు మండలం నందిపాడు ప్రాతం లో
వరుస దొంగతనాలతో నందిపాడు ప్రజల్లో ఆందోళన
పోలీస్ పెట్రోలింగ్ ఎక్కడ? అని ప్రశ్నిస్తున్న ప్రజలు
నందిపాడు: నందిపాడు పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్న దొంగతనాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల బైక్ చోరీ, వైన్ షాప్‌లో చోరీ ఘటనలు వెలుగులోకి రాగా.. తాజాగా నందిపాడు పెట్రోల్ బంక్‌లో కూడా దొంగతనం జరిగినట్లు సమాచారం. వరుస ఘటనలతో స్థానికులు, వ్యాపార వర్గాలు అప్రమత్తమవుతున్నాయి.
మొన్న బైక్, వైన్ షాప్ మరియు స్థానిక ఒక హోటల్లో సామాగ్రి చోరీ ఘటనలు చోటుచేసుకోగా.. నిన్న పెట్రోల్ బంక్‌లో దొంగలు దర్జాగా కార్ నుండి వచ్చి చోరీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వరుస ఘటనల నేపథ్యంలో రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రధాన రహదారులు, వ్యాపార ప్రాంతాలు, పెట్రోల్ బంకులు, దుకాణాల వద్ద రాత్రి వేళల్లో నిఘా పెంచాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించడంతో పాటు, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
“వరుసగా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్ మరింత పెంచాలి. వ్యాపారులు, ప్రజలకు భద్రతపై భరోసా కల్పించాలి” అని స్థానికులు కోరుతున్నారు.
దొంగతనాలపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


