ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. రైతు రుణమాఫీ 100 శాతం పూర్తయి ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆయన సవాల్ విసిరారు. శనివారం ఖమ్మం నగరంలోని 1వ పట్టణ, 2వ పట్టణ బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నప్పటికీ ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను, రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి ఏనుగు రాకేష్ రెడ్డి, నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, ఖమ్మం కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, బచ్చు విజయ్ కుమార్, కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.



