ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే నల్లమిల్లి, టీడీపీ ఇంచార్జ్ మనోజ్ రెడ్డి
బిక్కవోలు, జూలై 27 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా బిక్కవోలు మండలం తొస్సిపూడిలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమరావతి, పోలవరం, పరిశ్రమల ఏర్పాటు, రహదారుల అభివృద్ధి, సాగునీటి రంగం తదితర అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు.
అనపర్తి నియోజకవర్గంలో గత రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కలిపి రూ.1,246 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఏ పథకం కింద ఎంత నిధులు ఖర్చు చేశారు, ఏ రహదారికి ఎంత వెచ్చించారు, ఏ గ్రామంలో, ఏ మండలంలో ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టారనే వివరాలను కరపత్రాల రూపంలో ప్రజలకు అందిస్తూ పారదర్శకంగా తెలియజేస్తున్నామని చెప్పారు.
ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలతో ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జ్ మనోజ్ రెడ్డి మాట్లాడి ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. రహదారుల అభివృద్ధి, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సూపర్ సిక్స్‌లో మిగిలిన హామీలను కూడా త్వరలో అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో సహకరిస్తున్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్థులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలో సహకరిస్తున్న పార్లమెంట్ సభ్యురాలికి కూడా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళా నాయకురాళ్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.



