అనపర్తి, ఆగస్టు 1 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు స్వర్గీయ నల్లమిల్లి మూలారెడ్డి గారి నాలుగవ వర్ధంతిని అనపర్తి నియోజకవర్గంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉన్న మూలారెడ్డి గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనపర్తి మండలం రామవరం, కుతుకులూరు, దుప్పలపూడి, బిక్కవోలు మండలం బిక్కవోలు, పందలపాక, ఆర్ఎస్పేట, రంగంపేట మండలం దొడ్డిగుంట, రాయవరం మండలం రాయవరం గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మూలారెడ్డి ప్రజా సేవ, పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావం, క్రమశిక్షణ నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



