
మేడ్చల్ : పున్నమి విలేకరి సందీప్.
మురహరిపల్లిలోని డబుల్ బెడ్రూమ్ (2BHK) ఇళ్లలో పెండింగ్‌లో ఉన్న మౌలిక వసతుల పనులను త్వరగా పూర్తి చేయకుండా, జూలై నెలాఖరుకల్లా లబ్ధిదారులు ఇళ్లలోకి గృహప్రవేశం చేయాలని బ్యానర్లు ఏర్పాటు చేయడం తీవ్ర విచారకరమని తెలంగాణ 2BHK జాయింట్ యాక్షన్ కమిటీ డైరెక్టర్ చిలుక అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సోమవారం జాయింట్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గారిని కలసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా చిలుక అనిల్ కుమార్ మాట్లాడుతూ… కనీస సౌకర్యాలైన నీరు, విద్యుత్, డ్రైనేజీ మరియు రోడ్డు పనులను పక్కనపెట్టి లబ్ధిదారులను ఇళ్లలోకి రావాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అరకొర వసతులతో లబ్ధిదారులు ఎలా నివసిస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మిగిలివున్న అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి, ఆ తర్వాతే లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ 2BHK జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వెంకటేష్‌తో పాటు మురహరిపల్లి లబ్ధిదారులు వినీత, వినయ్, ద్వారక, ఇమ్రాన్, శేఖర్, లక్ష్మి, అలీ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారుల సమస్యలపై జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

