భారతదేశ విజ్ఞాన సంపద ప్రపంచానికే మార్గదర్శకమని మైదుకూరు సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ డాక్టర్ పసుపులేటి శంకర్ అన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలోని సెమినార్ హాల్‌లో మంగళవారం భారతీయ విజ్ఞాన వ్యవస్థపై సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో డాక్టర్ శంకర్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం భారతీయ విజ్ఞాన వ్యవస్థ అనే సంస్థను 2020 అక్టోబర్ 5న స్థాపించడం శుభపరిణామమన్నారు. విద్యా వ్యవస్థ ఏకీకరణ, వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ సంక్షోభం, సాంస్కృతిక ఏకీకరణ, మానసిక ఆరోగ్య సమస్యల సమతుల్యత కోసం శ్రమిస్తున్న ఈ సంస్థ భావి భారత యువతకు మంచి దిశానిర్దేశం చేయగలదన్నారు.
మన దేశంలోని మహర్షులు దర్శించి రచించిన నాటి గ్రంథాలు నేటికీ ప్రామాణికంగా ఉన్నాయన్నారు. వైద్యరంగంలో చరకుడు, శుశ్రుతుడు పేర్లు ముందువరుసలో ఉంటాయన్నారు. కావేరి నదిపై కరికాల చోళుడు సుమారు 1,850 సంవత్సరాల క్రితం నిర్మించిన రాతి ఆనకట్ట ప్రపంచంలోనే ప్రాచీనమైన ఆనకట్టల్లో ఒకటని, నేటికీ సుమారు 10 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నదని తెలిపారు.
మిహిరాచార్యుల బృహత్సంహిత వ్యవసాయం, భూగోళశాస్త్రం, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యం, గణితశాస్త్రాల అధ్యయనానికి అద్భుతమైన గ్రంథమన్నారు. భూకంపాలు ఎప్పుడు సంభవిస్తాయి, మేఘోత్పత్తి, భూమిలో నీరు ఎంత లోతులో ఉందనే విషయాలను తెలుసుకునే అంశాలు అందులో ఉన్నాయన్నారు.
భాస్కరాచార్యులు తన కుమార్తె పేరుతో రచించిన ‘లీలావతి’ గణిత గ్రంథం ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువదించబడిందన్నారు. ఆర్యభట్ట ఆవిష్కరణలు శాస్త్రరంగాన్ని మార్చివేశాయన్నారు. చాణక్యుని అర్థశాస్త్రం నేటికీ ఆదర్శప్రాయమన్నారు.
కైలాసనాథ ఆలయం, బృహదీశ్వర ఆలయం, పూరీ, హంపి దేవాలయాల నిర్మాణాలు, బేలూరు–హళేబీడు శిల్పకళ ద్వారా భారతీయులు శిల్పశాస్త్రంలో తమ ప్రతిభను ప్రపంచానికి చాటుకున్నారని అన్నారు. రాళ్లలో సరిగమపదనిసలు పలికించే శిల్పాలను సైతం రూపొందించారని తెలిపారు.
ప్రపంచంలోని తొలి విశ్వవిద్యాలయంగా తక్షశిలకు విశిష్ట స్థానం ఉందన్నారు. ఇంగ్లాండ్‌లో 1811లో తొలి పాఠశాల ఏర్పాటు చేసే నాటికి భారతదేశంలో 7,32,000 గురుకులాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2015లో అంగారక గ్రహంపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు ప్రకటించిందని, మిహిరాచార్యుల బృహత్సంహితలో అంగారక గ్రహంపై నీటితో పాటు ఇనుము ఉన్నట్లు ప్రస్తావించబడిందని తెలిపారు. రైట్ సోదరులు విమానం ఎగురవేయడానికి ముందు 1898లో శివకర్ బాపూజీ తల్పడే విమాన ప్రయోగం చేశారని పేర్కొన్నారు.
సాహిత్య రంగంలో శ్రీరామాయణం, శ్రీమహాభారతం వంటి మహాగ్రంథాలు ప్రాచీన కాలంలోనే రచించబడ్డాయని అన్నారు. ప్రపంచం పదార్థాలపై పరిశోధనలు చేస్తే భారతదేశం యథార్థాలపై పరిశోధనలు చేసిందన్నారు. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనే విశాలమైన భావన భారతీయ విజ్ఞానంలో ఉందన్నారు. కరోనా సమయంలో ప్రపంచంలోని పలు దేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్‌ను అందించిందని తెలిపారు.
భారతీయ విజ్ఞాన వ్యవస్థ మరింత బలపడేలా విస్తృత ప్రచారం జరగాలని, సంస్కృత భాష పరిఢవిల్లాలని, వేదాధ్యయనం మరింత పెరగాలని డాక్టర్ శంకర్ ఆకాంక్షించారు.
సమావేశంలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ.. వేదాల గురించి ప్రతి వ్యక్తి తెలుసుకున్నప్పుడు సనాతన ధర్మం గొప్పతనం అవగతమవుతుందన్నారు. విశ్వవిద్యాలయ కులసచివులు బాలభద్ర ఉపాధ్యాయ మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను అన్ని అంశాల్లో వెలికితీసేందుకు కృషి చేసి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు.
డీన్ అకాడమిక్ ప్రిన్సిపాల్ వెంకట రాధే శ్యామ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చేయాలనుకునే పరిశోధనలకు ఈ విశ్వవిద్యాలయం సరైన ప్రదేశమన్నారు. పౌరోహిత్య డీన్ పావన కుమార్ శర్మ మాట్లాడుతూ భారతీయ విజ్ఞాన వ్యవస్థలో వేద వాఙ్మయ పాత్ర ఎంతో గొప్పదన్నారు.
కార్యక్రమంలో కడప సాయి విజ్ఞాన పాఠశాల అధినేత భూపతి రాయల్, ఐఓసీ డీలర్ కిషోర్ గుప్తా, రాష్ట్ర ఆర్థిక సంస్థ విశ్రాంత జనరల్ మేనేజర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం డాక్టర్ పసుపులేటి శంకర్‌ను శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఘనంగా సన్మానించింది.


